ఐరోపాలోకి వలసల వల్లే పాశ్చాత్య నాగరికత నాశనమవుతోంది: జేడీ వాన్స్

  • గత డిసెంబర్ లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో శ్వేతజాతీయుడిని హత్య చేసిన సిక్కు యువకుడు
  • 'వలసదారుల దండయాత్ర' అంటూ వాన్స్ విమర్శలు 
  • తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం జేసుకోవడంపై తీవ్రంగా స్పందించిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం

అంతర్జాతీయ వేదికపై అమెరికా, బ్రిటన్ దేశాల మధ్య ఊహించని విధంగా తీవ్ర దౌత్యపరమైన, రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్రిటన్‌లో జరిగిన ఓ శ్వేతజాతీయుడైన విద్యార్థి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ... అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఐరోపా దేశాల్లోకి విపరీతంగా వస్తున్న వలసల వల్లే అక్కడి నాగరికత క్షీణిస్తోందని, ఇదొక "వలసదారుల దండయాత్ర" అంటూ వాన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


అసలు వివాదం ఏమిటి?

గత డిసెంబర్‌లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే శ్వేతజాతీయుడైన విద్యార్థిని, విక్రమ్ దిగ్వా అనే సిక్కు యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అయితే, నిందితుడు విక్రమ్ తాను బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు అబద్ధం చెప్పాడు. దీనివల్ల తీవ్ర గాయాలతో పడి ఉన్న హెన్రీ నోవాక్‌ను పోలీసులు చనిపోయే ముందు బేడీలు వేసి ఉంచారు. ఈ ఘటన బ్రిటన్‌లో తీవ్ర హింసాత్మక అల్లర్లకు దారితీయడమే కాకుండా, అంతర్జాతీయంగా రైట్ వింగ్ నేతల ఆగ్రహానికి కారణమైంది.


ఈ ఉదంతంపై అమెరికా జేడీ వాన్స్ స్పందిస్తూ... "ఒక నాగరికత ఎలా అంతరిస్తుందో.. హెన్రీ నోవాక్ కూడా అలాగే చనిపోయాడు. అధికారులు అతడిని పట్టించుకోకుండా, చేయని ద్వేషపూరిత నేరాలకు బాధ్యుడిని చేస్తూ బేడీలు వేశారు" అని అన్నారు. గత కొన్ని తరాలుగా ఐరోపా పాలకులు తీసుకుంటున్న ఆత్మద్రోహ నిర్ణయాలు, పశ్చిమ దేశాలను ద్వేషించే వలసదారుల దండయాత్ర వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, పాలకుల వైఖరిపై ప్రజల్లో 'న్యాయబద్ధమైన ఆగ్రహం' రావాలని ఆయన పిలుపునిచ్చారు.


జేడీ వాన్స్‌కు అత్యంత ఆప్తమిత్రుడైన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ఘటనపై, బ్రిటన్ పోలీసుల తీరుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా బ్రిటన్‌లోని పోలీస్ వ్యవస్థను తప్పుబడుతూ నివేదిక ఇవ్వడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

అమెరికా ఉపాధ్యక్షుడు నేరుగా తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. "మా ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకునేందుకు, మా వీధుల్లో విభజనలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు" అని స్టార్మర్ ప్రతినిధి మండిపడ్డారు. ఎలాన్ మస్క్ కూడా బ్రిటన్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని స్టార్మర్ నేరుగా ఆరోపించారు. ఈ దారుణ హత్యను దేశంలో ద్వేషాన్ని, ఉద్రిక్తతలను పెంచడానికి వాడుకోవద్దని మృతుడు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కోరినట్లు బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

JD Vance
Western civilization
Immigration
Henry Nowak
Keir Starmer
Elon Musk
US UK diplomatic tension
Migrant invasion
Southampton murder case
US State Department

More Telugu News